మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. దీనిపై తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ - అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. ఈ మేరకు అమ్మ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.
కాగా, ఇప్పటివరకు అమ్మ సంఘానికి మోహన్‌లాల్ అధ్యక్షుడిగా ఉండగా, నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక అనంతరం పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు.