బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా ల్యూక్ అమెరికాలో చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ నృత్యకారిణి, నటి కల్పా అయ్యర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన ల్యూక్ తుదిశ్వాస విడిచినట్టు కల్పనా అయ్యర్ నిర్ధారించారు. అయితే, ల్యూక్ మరణానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.
హెలెనా ల్యూక్‌తో మిథున్ చక్రవర్తి వివాహం బంధం కేవలం నాలుగు నెలల పాటే కొనసాగింది. 1979లో వీరిద్దరు పెళ్ళి చేసుకోగా, అదే యేడాది విడిపోయారు. ఆ తర్వాత హెలెనా ల్యూక్ అమెరికాకు వెళ్లిపోయి అక్కడే విమాన రంగంలో స్థిరపడిపోయారు.
హెలెనాతో విడిపోయిన తర్వాత మిథున్ చక్రవర్తి 1979లో మరో నటి యోగితా బాలిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. మిథున్ మొదటి భార్య హెలెనా ల్యూక్ బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సరసన్ "మర్డ్" చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె బ్రిటీష్ రాణి పాత్రను పోషించారు.