Ramakrishna Gowd, Ramesh Naidu and others
`తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మాఫియా ఇజం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో ఇటీవల కొత్త జీవో విడుదల చేసింది. దీనివల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు టియఫ్‌ఫ్ సీసీ చైర్మన్ డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్. ఇటీవల రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన కొత్త బిల్లు నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయితీకి ఒక రేటు, మున్సిపాలిటీకి ఒక రేటు జిల్లా స్థాయిలో ఒకరేటు అనే సిస్టమ్ ఉంటే తప్ప చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి. కచ్చితంగా జీవో 21ను సవరించాలి. అలాగే లీజు విధానాన్ని కూడా రద్దు చేయాలి. సినిమా థియేటర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను కూడా పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై పునరాలోచించాలి. చిన్న నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడే పెద్ద నిర్మాతలు ఒక్కరూ లేరు. రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు వేల థియేటర్స్ వరకు వాళ్లవే. ఇక్కడ లీజ్ కి తీసుకునేది కూడా వాళ్లే. టికెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ రెంట్లు కూడా పెంచాలి..కానీ పెంచడంలేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఆ నలుగురుది మాత్రమే కాదు. చిన్న నిర్మాతలు, చిన్న హీరోలది కూడా.
ఆ నలుగరైదుగురు దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు మునిగిపోతున్నారు. టికెట్ విధానం, లీజు సిస్టమ్ ని ఇంకా కొనసాగించడం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో జరుగుతోన్నపెద్దవాళ్ల దోపిడి. దీన్ని కచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఇది సినీ ఇండస్ట్రీకి మంచిది కాదు. టికెట్ల రేట్లు పెంచినా, తగ్గించినా ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి. పెద్ద నిర్మాతలకన్నా చిన్న నిర్మాతలే ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకోని పని చేయాలి తప్ప ఆ నలుగరికే మేలు చేసుకునేలా జీవోలు తెచ్చుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు.
జిల్లాల్లో, మున్సిపల్ లో, గ్రామ పంచాయితీలో ఇలా ప్రాంతాలను బట్టి టికెట్ రేటు పెట్టింది ఏపీ ప్రభుత్వం. నిజంగా ఇది హర్షించదగింది. ఆ విధానం తెలంగాణలో కూడా వస్తే బావుంటుంది. అలాగే లీజు సిస్టమ్ పై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు. సినిమాకు మంచి టాక్ వచ్చినా కానీ సడన్ గా మధ్యలో తీసేసి వాళ్ల సినిమాలు వేసుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం ఇది కొనసాగుతుంది. చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి అంతటా ఒకే రేటు కాకుండా పాత పద్దతినే కొనసాగించాలని టియఫ్‌సీసీ తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం సహకారంతో త్వరలో అవార్డ్స్ కూడా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాం`` అన్నారు.
తెలంగాణ డైరక్టర్స్ యూనియన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ, `సినీ పరిశ్రమలోని 24 శాఖలు బతికేది చిన్న సినిమాల వల్లే. కానీ చిన్న సినిమా మనుగడే నేడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం పెద్ద సినిమాలకు తప్ప చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకని పరిస్థితి. ప్రభుత్వాల దగ్గర తమ పేరు ప్రఖ్యాతలను ఉపయోగించి ఆ నలుగురు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. థియేటర్స్ లీజు వ్యవస్థని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంటేనే సినిమా పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి. ఇక ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల రేట్ల విషయంలో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో మరి అంత రేట్లు తగ్గించడం, తెలంగాణలో మరి రేట్లు పెంచడం సరైనది కాదు. ఇరు ప్రభుత్వాలు దీనిపై పునరాలోచించాలి అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో టీ.మా జనరల్ సెక్రటరీ సకమ్ స్నిగ్ధ మడ్వాని, బి కిషోర్ తేజ, టీ.మా వైస్ ప్రెసిడెంట్ ఏ.కిరణ్ కుమార్, తెలంగాణ డైరక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్.రమేష్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఎస్.వంశీ గౌడ్, టియఫ్‌ఫ్ సిసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గూడూరు చెన్నారెడ్డి, టి.మా ఆర్గనైజింగ్ సెక్రటరి అశోక్ గౌడ్, టి.మా జాయింట్ సెక్రటి రాజయ్య, టి.మా ఈసీ మెంబర్ రవితేజ .జి, ప్రేమ్ సాగర్, శ్రీశైలం, సయ్యద్ వహీద్, శివ పాలమూరు, రాకి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు.