Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్‌కు శుభాకాంక్షలు... గోల్డ్ ఏజ్ హోమ్‌ మా డ్రీమ్... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

Advertiesment
MAA
, బుధవారం, 12 డిశెంబరు 2018 (18:17 IST)
రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని రెండోసారి కూడా సాధించిన ఘనత కె.సి.ఆర్‌కు దక్కిందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా తమ ముందు ఓ పెద్ద బాధ్యత ఉందని, గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ఈ కార్యవర్గం ఉండగానే ప్రారంభించాలనుకుంటున్నామని శివాజీరాజా తెలిపారు. 
 
అందుకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు, కె.టి.ఆర్., హరీశ్ రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్ గార్ల సహకారం లభిస్తుందని భావిస్తున్నామని అన్నారు. ఒకసారి మాట ఇస్తే దాని మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ అని, ఆ నమ్మకం తమకు ఉందని శివాజీరాజా అన్నారు. త్వరలోనే ఈ విషయమై కేసీఆర్ గారిని కలుస్తామని, తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గోల్డ్ ఏజ్ హోమ్'ను ఆయన సహకారంతో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా సిద్ధిపేటను అత్యంత ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన హరీశ్ రావును శివాజీ రాజా అభినందించారు. 
 
ఆ అభివృద్ధి కారణంగానే అక్కడి ప్రజలు లక్ష ఓట్లకు పైగా మెజారిటీని ఆయనకు అందించారని అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన ఫిగర్‌ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి భారీ మెజారిటీ సాధించారని 'మా' కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సినీ ప్రముఖుల సహకారంతో, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్‌లో గోల్డ్ ఏజ్ హోమ్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని, తెలంగాణ ప్రభుత్వం సైతం తమవంతు సహకారం అందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. పది పదిహేను సంవత్సరాలపాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వం మీద నమ్మకంతోనే రెండోసారి కూడా టీఆర్ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరినీ కేసీఆర్ బాగా చూసుకుంటారని బెనర్జీ తెలిపారు. 
 
గడిచిన నాలుగున్నర యేళ్ళకు మించిన అభివృద్దిని రాబోయే ఐదేళ్ళలో కేసీఆర్ చేస్తారనే నమ్మకం తనకుందని ఆయన అన్నారు. రెండోసారి కూడా భారీ మెజారిటీతో, భారీ సీట్లను టి.ఆర్.ఎస్. పొందడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్, మాగంటి గోపీనాథ్ వంటి సినిమా వారు గెలవడం సంతోషంగా ఉందని ఏడిద రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్‌కు సురేశ్ కొండేటి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, మాగంటి గోపీనాథ్ వంటి వారి సహకారంతో చిత్రసీమ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనా రనౌత్ సత్తా చాటింది.. మూడు భాషల్లో మణికర్ణిక