తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన అలనాటి మేటి నటి జయకుమారి ఇపుడు ఇతరుల సాయం ఎదురు చూస్తున్నారు. అనారోగ్య సమస్యలతో పాటు రెండు కిడ్నీలు పాడైపోవడంతో ఆమె చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ, వారు ఆమె బాగోగులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇతరల సాయం కోసం ఆమె ఎదురు చూస్తున్నారు.
చెన్నై, వేళచ్చేరిలోని ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ వచ్చిన జయకుమారి అనారోగ్యానికి గురికావడంతో చెన్నై నంగనల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ వచ్చారు. అక్కడ ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో రెండు కిడ్నీలు పాడైపోయినట్టు తేలింది. దీంతో ఆమెకు మరింత మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వీలుగా ఆమెను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కూడా వైద్యం కోసం అయ్యే ఖర్చుల కోసం ఇతరుల నుంచి సాయం ఎదురు చూస్తున్నారు.
ఈమె గత 1966లో తమిళ సూపర్ స్టార్ డాక్టర్ ఎంజీ.రామచంద్రన్ నటించిన "నాడోడి" చిత్రంలో విలన్‌గా నటించిన సుప్రసిద్ధ నటుడు నంబియార్‌కు అంధురాలైన చెల్లి పాత్రను పోషించి వెండితెరకు తొలిసారి పరిచయమయ్యారు.