తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
కాగా, రొటీన్ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినట్టు ఆయన భార్య లతా రజనీకాంత్ ప్రకటించారు. ఆ తర్వాత ఆస్పత్రి వైద్యులు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ తీయగా, అందులో రక్తనాళం పగిలినట్లు గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దీంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రజనీ క్షేమంగా ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.
దీనిపై రజనీ సతీమణి లత మాట్లాడుతూ.. ఏటా నిర్వహించే సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆయన కావేరీ ఆస్పత్రికి వెళ్లారని, అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.