వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మే ఒకటో తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ రోజున కూడా విడుదల కావడం ఇపుడు సందేహాస్పదంగా మారింది.
ఎందుకంటే గతంలో ఈ చిత్రం విడుదల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులే దీనికి కారణం. ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు సంబంధించి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంతవరకు తాము గతంలో జారీచేసిన ఉత్తర్వులు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ విషయమై చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డికి ఏప్రిల్ 10వ తేదీన ఈసీ లేఖ రాసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ సినిమాను విడుదల చేయవద్దని ఆదేశించింది. కోడ్ ముగిసే వరకు ఎన్నికలకు విఘాతం కలిగించే బయోపిక్‌లు ప్రదర్శించవద్దని నిబంధనల్లో ఉన్నట్లు పేర్కొంది.
కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఏకపక్షంగా మే ఒకటో తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అదీకూడా ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తొలుత ఈ సినిమాను మార్చిలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా తీశారంటూ ఈసీకి ఫిర్యాదులు అందిన విషయం తెల్సిందే.