వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రోడ్డుపైనే ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ఓ వ్యక్తి బెదిరింపులకు భయపడి ఆయన ఇలా చేయాల్సి వచ్చింది. దీనిపై ఆయన వరుస ట్వీట్లు చేస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా గత మార్చి నెలలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల కారణంగా ఈ చిత్రం ఏపీలో మాత్రం విడుదల కాలేదు.
ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రాంగోపాల్ వర్మ ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకోసం నోవాటెల్ హోటల్‌లో ఓ హాలును బుక్ చేసుకున్నారు. రానీ, కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట.
దీంతో ఆగ్రహించిన వర్మ "ఒక వ్యక్తికీ భయపడి హోటల్ యాజమాన్యం బుకింగ్ క్యాన్సిల్ చేసింది. హోటళ్లు, క్లబ్బుల మేనేజిమెంట్స్ మనందరికీ తెలిసిన ఒక వ్యక్తికి భయపడుతున్నారు. అందుకే ఈరోజు సాయంత్రం విజయవాడలోని పైపుల రోడ్డులో నడిరోడ్డు మీద సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా. మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ అభిమానులకి, నా మీద ఇష్టం ఉన్న వారికి నా బహిరంగ ఆహ్వానం" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.