విదేశీ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే టి-20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లో కూడా విజయం సాధించి టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇంత వరకు ఏ జట్టూ సాధించని రికార్డును భారత జట్టు నెలకొల్పింది.
5 మ్యాచుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఏకైక జట్టుగా టీం ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. చివరి టీ-20లో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ 45, కెప్టెన్ రోహిత్ శర్మ 60, శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులు చేశారు.
164 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీసుకున్నాడు. బూమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
మరోవైపు ఈ చివరి ట్వంటీ-20లో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ (కోహ్లీకి విశ్రాంతి) గాయపడ్డాడు. 60 పరుగులు చేసిన తర్వాత కనీసం నడవలేని స్థితిలో రిటైర్డ్ హర్ట్‌గా పెవీలియన్ చేరాడు. దీంతో న్యూజీలాండ్ బ్యాటింగ్ సమయంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన తర్వాత ప్రెజెంటేషన్ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా రాహులే మొదట మాట్లాడాడు.
ఆ తర్వాతే సిరీస్ గెలిచిన కప్ అందుకోవడానికి కొహ్లీ వచ్చాడు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా టీమిండియా సారథిగా మారే సత్తా కేఎల్ రాహుల్‌లో వుందని నిరూపితమైంది. మెల్ల మెల్లగా కేఎల్ రాహుల్‌కు అంతా కలిసి వస్తుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు.