క్రికెట్ ఫ్యాన్స్‌ ఫిదా.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా గెలుపు.. కోహ్లీ రికార్డ్

బుధవారం, 29 జనవరి 2020 (17:53 IST)
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ-20లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ టైగా మారడం.. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో భారత్ ఛేదనకు దిగి చివరి రెండు బంతుల్లో అద్భుతంగా విజయం సాధించడం క్రీడాభిమానులను ఫిదా చేసింది. భారత్ వుంచిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది.

నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేయలేక చేతులెత్తేసిన న్యూజిలాండ్ టైతో తన ఇన్నింగ్స్ ముగించింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఆద్యంతం ఉత్కంఠగా.. సాగిన ఈ సూపర్ ఓవర్‌లో క్రికెట్ ఫ్యాన్సుకు గుడ్ ట్రీట్ ఇచ్చింది టీమిండియా. 
 
హామిల్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (65), కేఎల్ రాహుల్ (27) కొహ్లీ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇక 179 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 88 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

కాగా, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 95 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. ఆఖరి ఓవర్లో షమీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో 179 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. 
 
దీంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. బూమ్రా వేసిన ఈ ఓవర్లలో విలియమ్సన్ 12, గుప్తిల్ 5 పరుగులు చేయడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి నాలుగు బంతుల్లో కేవలం 8 పరుగులే చేశారు.

కాని చివరి రెండు బంతులను రోహిత్ శర్మ సిక్సులగా మలచడంతో భారత్ గెలుపు సునాయాసమైంది. రోహిత్ శర్మకు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా 5 మ్యాచుల సిరీస్‌లో మరో రెండు మ్యాచులు మిగిలిఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.
 
ఇకపోతే.. హామిల్టన్‌లోని సెడాన్ పార్కులో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ధోనీ ఫీట్‌ను అధిగమించాడుగా..!