తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురట్చితలైవి జయలలిత. ఈమెకు అత్యంత ఆత్మీయ సన్నిహితురాలు శశికళ జీవితం ఆధారంగా "శశిలలిత" సినిమా తెరకెక్కుతోంది. 'జయం' మూవీస్ అధినేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కాజల్ దేవగన్, శశికళ పాత్రలో అమలా పాల్ నటించబోతున్నారని కేతిరెడ్డి చెప్పారు.
ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన ఆయన.. "శశిలలిత" సినిమా ద్వారా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూపించ బోతున్నామని తెలిపారు. ఈ సినిమా ద్వారా పలు యదార్థ సంఘటనలు తెరకెక్కించనున్నామనీ.. 78 రోజులు హాస్పిటల్‌లో ఏం జరిగిందో చెప్పబోతున్నామని చెప్పుకొచ్చారు.
జయలలిత బాల్యం నుండి చిత్ర పరిశ్రమకు రావడం, శోభన్ బాబుతో ఆవిడ ప్రేమ వ్యవహారం, ఇలాంటి అన్ని అంశాలూ ఇందులో కవర్ చేస్తామని చెప్పారు. జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలన్నింటినీ రెండన్నర గంటల్లో వివరించబోతున్నామనీ... ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను... కోడ్ తొలగిన వెంటనే విడుదల చేస్తామన్నారు.