ఇటీవల నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన వెంటనే ఆయనను నెల్లూరులోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. అనంతరం శనివారం రాత్రి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో కత్తి మహేశ్ రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ శ్రీరాములు తెలిపారు. ప్రమాదం వల్ల మెదడులో రక్తస్రావం జరగలేదని... అందువల్ల ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు.
మరోవైపు ఆయన కళ్లకు ఈరోజు వైద్యులు ఆపరేషన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కత్తి మహేశ్ వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆయన కుటుంబసభ్యులతో పాటు కొందరు బంధువులు ఉన్నారు.