బడ్జెట్‌పై బాండు పత్రాన్ని రాసిచ్చిన శంకర్.. ఎందుకంటే?

గురువారం, 16 మే 2019 (16:32 IST)
1996లో వచ్చిన కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీ "భారతీయుడు" సీక్వెల్‌ని ఈ మధ్య ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు శంకర్ పెట్టించే ఖర్చుకు భయపడి నిర్మాణ సంస్థ లైకా వెనుకంజ వేసింది. ఈ టాక్‌కి బలం చేకూర్చేలా షూటింగ్ ఆగిపోవడం, దీని గురించి కమల్ కానీ శంకర్ కానీ ఎక్కడా ప్రస్తావించకపోవడం అనుమానాలను బలపరిచింది. 
 
ఇప్పుడు మరోసారి లైకాతో శంకర్ సీరియస్ డిస్కషన్‌లో ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్ కంట్రోల్‌లోనే పెడతానని, అనుకున్న సమయానికి పూర్తి చేసి 2021 సంక్రాంతికి రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. "2.0" విషయంలో ఇలాగే చెప్పి మాట తప్పి ఖర్చుని తడిసిమోపెడు చేసిన శంకర్‌తో లైకా సంస్థ అగ్రిమెంట్ వ్రాయించుకునే పనిలో ఉందట. 
 
కమల్ ఫ్యాన్స్‌కు ఇది తీపి కబురే. రాజకీయ ప్రచారంలో యమ బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం బిగ్ బాస్ 3 యాంకరింగ్‌కు మాత్రమే కమిట్ అయ్యాడు. "ఇండియన్ 2" ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేలా ఉంది కాబట్టి, కమల్ ఏడాది పాటు ఖాళీగా ఉండే అవకాశం లేదనిపిస్తోంది. షూటింగ్‌లో బిజీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మరో యూత్ హీరోని ఫైనల్ చేయాల్సి ఉంది. శంకర్ భారతీయుడుకి కొనసాగింపుగా వచ్చే ఇండియన్ 2కి సైతం సుమారు 200 కోట్ల బడ్జెట్ అడిగాడట. ఇప్పుడు దానిని గణనీయంగా తగ్గిస్తానని హామీ ఇవ్వడంతో జూన్ చివరి వారం నుంచి సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తేజ - కాజల్ మూవీ "సీత" సెన్సార్ పూర్తి