జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సోదర ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‍పై కల్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న కల్యాణ్‌రామ్.. తన తమ్ముడి గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. తారక్‌ను నాన్నా అని పిలుస్తానని, తమ్ముడు అని ఎప్పుడూ పిలవనని చెప్పాడు.
తారక్ తనతో కొన్ని సార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడని, కొన్ని సార్లు చిన్న పిల్లాడిగా మారిపోతాడని వెల్లడించాడు. సాధారణంగా మేం ఏ సినిమాలు చేస్తున్నామో వాటి గురించి చిన్నపాటి డిస్కషన్ ఉంటుంది. అలాంటి డిస్కషన్‌లో ఎంత మంచి వాడవురా కథ గురించి చెప్పగానే తను హ్యాపీగా ఫీలయ్యాడని తెలిపాడు.
కాగా, అతనొక్కడే నుంచి 118 వరకు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ తాజాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎంత మంచివాడవురాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు.
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శతమానం భవతి చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదలైన సంగతి తెలిసిందే.