గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భందాల్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ గర్భందాల్చిందనీ అందుకే ముందుగా అంగీకరించిన ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది.
ఇపుడు ఈ వార్తలపై కాజల్ అగర్వాల్ స్పందించారు. "ఈ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సరైన సమయంలో దీని గురించి స్పందిస్తా" అని చెప్పింది.
కాజల్ చెల్లిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని చిత్రాల్లో నటించిన నిషా అగర్వాల్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆమెకు ఓ అబ్బాయి. అయితే కాజల్ కూడా త్వరగా తల్లి అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తెలిపింది.
ఈ విషయమై స్పందించిన 'చందమామ' భామ.. "ఈ విషయం నన్ను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. కానీ అదేసమయంలో ఒత్తిడికి కూడా లోనవుతా. నిషా జీవితం ఎలా మార్పు చెందుతూ వచ్చిందో చూశా. ఆమె జీవితానికి పరిపూర్ణత వచ్చింది. తల్లిగా మారడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఆ దశలో సెల్ఫ్ రియలైజేషన్ అవుతారని అనుకుంటా.
అయినా నిషా కుమారుడుతో ఉన్నప్పుడు నన్ను నేను ఓ తల్లిగా భావిస్తా. ఇప్పుడు మా ఇంట్లో మియా(పెంపుడు కుక్క) వచ్చాక కూడా.. నేను, గౌతమ్ తల్లిదండ్రులుగా ఫీల్ అవుతున్నాం. నాకు సొంత పిల్లలు పుట్టినప్పుడు ఈ ఎమోషన్ ఇంకా ఎక్కువ అవుతుందనుకుంటా" అని కాజల్ చెప్పింది.