మహా నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.టి.రామారావు 102వ జయంతి వేడుకల బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాటుకు ఆయన కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, సినీ రాజకీయ అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించిన వారిలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్డీఆర్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకింది. దీంతో ఎన్టీఆర్ జోహార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు.