Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతీయ‌ అవార్డులకు 'జెర్సీ' అన్ని విధాలా అర్హ‌మైందిః సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

జాతీయ‌ అవార్డులకు 'జెర్సీ' అన్ని విధాలా అర్హ‌మైందిః సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
, మంగళవారం, 23 మార్చి 2021 (17:38 IST)
Suryadevara Nagavamsi
‌‌సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన 'జెర్సీ' మూవీ 2019 జాతీయ చల‌న‌చిత్ర అవార్డుల్లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా పుర‌స్కారాన్ని గెలుచుకొని స‌గ‌ర్వంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి ప‌నిచేసిన న‌వీన్ నూలి ఉత్త‌మ ఎడిట‌ర్‌గా అవార్డును పొందారు. ఈ రెండు పుర‌స్కారాలు తెచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే.. ‌మార్చి 26న విడుద‌ల‌వుతున్న 'రంగ్ దే' చిత్రం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు నాగ‌వంశీ. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం మీడియాతో స‌మావేశ‌మైన ఆయ‌న 'జెర్సీ' సినిమా విశేషాల‌ను పంచుకున్నారు. ఆ విష‌యాలు..
 
'జెర్సీ'కి రెండు జాతీయ అవార్డులు రావ‌డం ఎలా అనిపిస్తోంది?
'జెర్సీ'కి అవార్డులు వ‌స్తాయ‌ని ఊహించాం. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త ఏడాది జాతీయ అవార్డులు లేక‌పోయేస‌రికి వాటి గురించి మ‌ర్చిపోయాం. కానీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించేస‌రికి ఆశ్చ‌ర్య‌మూ, ఆనంద‌మూ రెండూ క‌లిగాయి. తొలిసారి మా సినిమాకు జాతీయ అవార్డులు రావ‌డం సంతోషంగా అనిపిస్తోంది. ఆ సినిమా కోసం హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు, బాగా క‌ష్ట‌ప‌డ్డారు. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ప‌డిన క‌ష్టం కూడా చిన్న‌దేమీ కాదు. 
 
'జెర్సీ' తీయాల‌ని ఎందుక‌నిపించింది?
గౌత‌మ్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు బాగా న‌చ్చేసింది. బేసిక‌ల్‌గా నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆ నేప‌థ్యం ఉన్న క‌థ కావ‌డం, మంచి భావోద్వేగాలు ఉండ‌టంతో క‌నెక్ట‌య్యాను. నానితో ఈ సినిమా చేయాల‌నుకున్నాడు గౌత‌మ్‌. అయితే ఏడు సంవ‌త్స‌రాల కొడుకు ఉన్న తండ్రి క‌థ‌ని నాని ఒప్పుకుంటారా, లేదా అని సందేహించాం. కానీ విన‌గానే నాని ఈ క‌థ‌ను న‌మ్మారు. ఏమాత్రం సందేహించ‌కుండా ఏడేళ్ల కొడుకున్న తండ్రిగా సూప‌ర్బ్‌గా న‌టించారు.
 
క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమాకు మీకు సంతృప్తినిచ్చిందా?
ప్రేక్ష‌కుల్ని ఇబ్బంది పెట్ట‌కుంటే చాలు అంటుంటారు బాబాయ్ (నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు‌)‌. క‌థ‌లో మేం ఎంట‌ర్‌టైన్‌మెంట్, హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటాం. జెర్సీ క‌థ‌లో క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ త‌క్కువే అయినా అందులోని ఎమోష‌న్స్‌ను నాని, నేను బాగా న‌మ్మాం కాబ‌ట్టే ఆ సినిమా చేశాం. రాయ‌ల‌సీమ‌, గుంటూరు ఏరియాలు మిన‌హా ఓవ‌ర్సీస్ స‌హా అన్ని చోట్లా క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా ఆడింది. రెండో వారం హాలీవుడ్ ఫిల్మ్ 'అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్' రావ‌డంతో క‌లెక్ష‌న్ల‌పై ప్రభావం ప‌డింది. అయిన‌ప్ప‌టికీ బాగానే ఆడింది.
 
ఈ రెండు అవార్డులే కాకుండా వేరే అంశాల్లో అవార్డులు వ‌స్తాయ‌ని ఆశించారా?
బెస్ట్ యాక్ట‌ర్‌గా నానికి, బెస్ట్ డైరెక్ట‌ర్‌గా గౌత‌మ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వ‌స్తాయ‌ని నేను న‌మ్మాను. అయితే ఇప్పుడు రెండు అంశాల్లో నేష‌న‌ల్ అవార్డ్స్ రావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అందుకు 'జెర్సీ' సినిమా పూర్తిగా అర్హ‌మైంది.‌
 
ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి స్పంద‌న ల‌భించింది?
ఇండ‌స్ట్రీకి సంబంధించిన చాలా మంది అభినంద‌న‌లు తెలిపారు. కొంత‌మంది ఫోన్ల ద్వారా, కొంత‌మంది సోషల్ మీడియా ద్వారా అభినందించారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.
 
మీ సినిమాతో పాటు 'మ‌హ‌ర్షి' చిత్రానికీ రెండు అవార్డులు ల‌భించడంపై మీ స్పంద‌న‌?
చాలా ఆనందంగా ఉంది. 'మ‌హ‌ర్షి' సినిమాని మంచి కాన్సెప్ట్‌తో తీశారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగాలంటే ఏం చేయాల‌నే క‌థ‌కి మ‌హేష్‌బాబు గారు త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో గొప్ప న్యాయం చేశారు. డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి చాలా బాగా దాన్ని రూపొందించారు. 'మ‌హ‌ర్షి' టీమ్ మొత్తానికీ మా సంస్థ త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా.
 
హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌లో మీ పాత్ర ఎంత‌వ‌ర‌కు ఉంటుంది?
హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుకు రెండు బ్యాన‌ర్ల‌యినా, నా వ‌ర‌కు అవి రెండూ ఒక‌టే. చెప్పాలంటే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ పేరిట నిర్మించే సినిమాల్లోనే నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. హారిక‌, హాసిని అనేవి మా చెల్లెళ్ల పేర్లు. ఆ ఇద్ద‌రి పేరిట హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ పేరును త్రివిక్ర‌మ్ గారు పెట్టారు. సాధార‌ణంగా నా ద‌గ్గ‌ర‌కు ఏదైనా క‌థ వ‌చ్చి, అది నాకు న‌చ్చితే బాబాయ్ (ఎస్‌. రాధాకృష్ణ‌) ద‌గ్గ‌ర‌కు పంపిస్తాను. ఆయ‌న‌కూ న‌చ్చితే అప్పుడు ప్రాజెక్ట్ మొద‌లుపెడ‌తాం. 
 
సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వ‌చ్చిన మీకు సినీ నిర్మాణం సంతోషాన్నిస్తోందా?
నేను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినీ రంగంలోకి రావ‌డానికి కార‌ణం మా బాబాయే. స‌హ‌జంగానే నాకు సినిమాలంటే చిన్న‌ప్ప‌ట్నుంచీ ఇష్టం. నిర్మాత‌ల్లో నాకు దిల్ రాజు గారంటే చాలా అభిమానం. ఆయ‌న స్వ‌యంకృషితో ఈ రంగంలోకి వ‌చ్చి ఉన్న‌త స్థాయికి ఎదిగారు. బాబాయ్ నిర్మాత‌గా సినిమాల్లోకి వ‌చ్చాక‌, న‌న్ను కూడా ర‌మ్మ‌నేస‌రికి సంతోషంగా వ‌చ్చేశాను. ఇప్పుడు మంచి సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థ‌లుగా మా బ్యాన‌ర్ల‌కు పేరు రావ‌డం మ‌రింత ఆనందంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HBDKanganaRanaut నాలుగోసారి జాతీయ అవార్డ్.. బర్త్ డేకు స్పెషల్ ట్రీట్