బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పుట్టినరోజును పురస్కరించుని ఇప్పటికే దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి ట్రైలర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా కంగనా రనౌత్ నాలుగో సారి జాతీయ అవార్డును దక్కించుకుంది. మణికర్ణిక, పంగా సినిమాలకుగాను ఆమెకు జ్యూరీ అవార్డును ప్రకటించి గౌరవించింది. ఇంతకు ముందు ఆమెకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.
2008లో ఫ్యాషన్ సినిమాకు గాను, 2014లో క్వీన్ సినిమాకు గాను, 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాకు గాను కంగనా రనౌత్‌కు జాతీయ పురస్కారాలు లభించాయి. ఇలా ఎక్కువ జాతీయ అవార్డులు గెల్చుకున్న నటీమణుల్లో కంగనా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. మొదటి ప్లేస్‌లో అత్యుత్తమ నటీమణి షబనా ఆజ్మీ నిలిచారు. ఆమెకు ఇప్పటి వరకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి.
1974లో వచ్చిన అంకూర్ సినిమాతో ఆమె నేషనల్ అవార్డుల వేట మొదలయ్యింది.. ఇది ఆమెకు రెండో సినిమా కావడం విశేషం. ఆ తర్వాత 1983 నుంచి 1985 వరకు వరుసగా మూడేళ్లు షబనా ఆజ్మీనే ఉత్తమ నటిగా నిలిచింది. అర్త్, ఖాందహార్, పార్ సినిమాలలో ఆమె కనబర్చిన అత్యుత్తమ నటనే ఆమెకు పురస్కారాలు లభించేలా చేసింది. 1999లో వచ్చిన గాడ్‌మదర్ సినిమాతో షబనా ఆజ్మీ మరో జాతీయ అవార్డును గెల్చుకుంది.
2019లో ఈమె రెండు సినిమాలు చేసింది. పంగాతో పాటు ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్ మణికర్ణిక సినిమాల్లో నటించింది కంగన. ఇందులో మణికర్ణిక సినిమాను క్రిష్ తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాల్లో అద్భుతమైన నటనకు గానూ ఈమెకు నేషనల్ అవార్డు వచ్చింది.
గతంలో మూడుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది ఈమె. తొలిసారి ఫ్యాషన్ సినిమాకు సహాయ నటి కేటగిరీలో నేషనల్ అవార్డు తీసుకుంది కంగన. అందులో ప్రియాంక చోప్రాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఆ తర్వాత క్వీన్, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్ సినిమాలకు కూడా జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకుంది.