రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం పేరు ఖరారు చేయడానికి ఈరోజు రామోజీ ఫిలింసిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ ప్రారంభం అయింది. ఫిలింసిటీ బయట గల ప్రాంతంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. బాహుబలి చిత్రం తీసిన వెనుక భాగంలో సెట్ వేసి తీర్చిదిద్దారు. దీనికోసం నేషనల్ మీడియాతో పాటు విదేశాల నుండి కూడా అభిమానులు వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి భారీగా ప్లాన్ చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఆస్ట్రేలియా పెర్త్‌కి చెందిన సునీల్ ఆవుల అనే ఓ అభిమాని ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం 12 గంటల ప్రయాణం చేసి హైదరాబాద్‌కి చేరుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన డెడికేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోగా, ఎస్ఎస్.కార్తికేయ కూడా స్పందించారు. ఇది అరుదైన సంఘటన. మహేష్ బాబుపై అభిమానుల ప్రేమ, ఈ సినిమా కోసం ఉన్న ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టం చేస్తోంది అన్నారు.
ఇక ఇటీవలే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను పరిచయం కుంభా, మందాకిని పోస్టర్లు విడుదల చేశారు. నేడు మహేష్ బాబు పేరును కూడా రిలీవ్ చేస్తూ టైటిల్ ప్రకటించనున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై చాలాకాలం గేప్ తర్వాత కె.ఎల్. నారాయణ, గోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇదిలా వుండగా, ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచనకు నిర్మాతల నుంచి బ్రేక్ పడింది. ఒక్క పార్ట్ లోనే పూర్తిచేయాలని రూల్ పెట్టినట్లు తెలిసింది. అందుకే త్వరగా సినిమాను పూర్తిచేస్తున్నట్లు సమాచారం.