Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

Advertiesment
ssrajamouli

ఠాగూర్

, శుక్రవారం, 14 నవంబరు 2025 (08:32 IST)
హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనున్న గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు 18 యేళ్లలోపు, వృద్ధులకు ప్రవేశం లేదని ప్రముఖ నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. అలాగే, ఫిజికల్ పాస్‌లు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
 
'ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతీ ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చాలా కఠినమైన సూచనలు జారీ చేశారు. దయచేసి అందరూ సహకరించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి' అని ఆయన స్పష్టం చేశారు.
 
కొందరు ఆన్‌లైన్‌లో పాసులు విక్రయిస్తున్నారని, ఇది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని ఏమాత్రం నమ్మొద్దని రాజమౌళి తెలిపారు. 
 
ఈవెంట్ వేదిక వద్దకు చేరుకునే మార్గాల గురించి కూడా ఆయన వివరించారు. 'మీ పాసులపై క్యూఆర్ కోడ్‌లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే, వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయి' అని వివరించారు. వీటితో పాటు దారిపొడవునా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
 
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇది మనందరి భద్రత కోసమేనని రాజమౌళి అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా 18 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారని, కాబట్టి వారు ఇళ్ల వద్ద నుంచే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
ఎల్లుండి జరగనున్న ఈ 'గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఒకేచోట హాజరుకానుండటంతో భారత సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్లలో ఒకటిగా నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, స్క్రీన్ (100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు) ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తుండటం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున