ఇదివరకు గాసిప్స్ అనేవి నటీనటులు సైతం వాటిని చదువుకుని నవ్వుకునే పరిస్థితి వుండేదని చాలామంది తారలు చెప్తుంటారు. గాసిప్స్ కూడా వారి కెరీర్‌కి కానీ వ్యక్తిగత ప్రతిష్టను కానీ దెబ్బతీసేవిగా వుండేవి కాదు. ఎవరో కొందరు నూటికి ఒక్కరు అవాస్తవమైన విషయాలను రాసి రాక్షసానందం పొందేవారని టాలీవుడ్ సెలబ్రిటీలే చెపుతున్నారు.
తాజాగా ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే... నాగార్జున తన కుమారుడు నాగచైతన్యకి పిల్లని చూసాడనీ, పరిచయం కూడా చేసారని రాసేస్తున్నారు. ఇక నాగచైతన్య విడాకులకు కారణాలు అవీఇవీ అంటూ ఎవరికితోచినట్లు వారు రాసేస్తున్నారు.
విడాకుల వ్యవహారం సందర్భంలోనే తమ వ్యక్తిగత జీవితం గురించి ఇకపై రాయొద్దు అని ఇరువురు సందేశాలు పంపారు. కానీ కొంతమంది మాత్రం వారిని వదిలిపెట్టడంలేదు. ఒకరికి మించి మరొకరు గాలి వార్తలు రాస్తూ అయోమయం సృష్టిస్తున్నారు. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడో తేల్చి చెప్పింది.
ఇటీవలి కాలంలో అవాస్తవ వార్తలు రాసే జబ్బుతో కొందరు బాధపడుతున్నారని, అలాంటివారు వండివార్చే వార్తలను పట్టించుకునేంత తీరిక లేదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంత మాటన్నాక కూడా అవాస్తవాలు రాసేవారిని ఇంకేమనాలో మరి.