Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Advertiesment
dharmendra deol

ఠాగూర్

, సోమవారం, 24 నవంబరు 2025 (17:05 IST)
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందంటూ బాలీవుడ్ నటు ధర్మేంద్ర మృతిపై రాజకీయ సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గతకొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని, ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలు తమ ప్రగాఢ సంతాపాలను వ్యక్తం చేశారు.
 
'ప్రముఖ నటుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ధర్మేంద్ర మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఆయన ఒకరు. దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినీ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తిగా, యువ నటీనటుల్లో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా' - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
 
'దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినీ రంగంలో ఒక శకం ముగిసింది. తన నటనతో ఎన్నో పాత్రలకు వన్నె తెచ్చారు. ఎంతో మంది ప్రేక్షకులను హృదయాల్లో నిలిచారు. గొప్ప నటుడైనా ఆయనలో నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనకే సొంతం. నిజంగా ఇదొక విషాద సమయం. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' - ప్రధాని నరేంద్ర మోడీ 
 
'ధర్మేంద్ర మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దిగ్గజ నటుడు, తన అద్భుతమైన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి తరతరాలు గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
 
'దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట నటుడిని కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఈ విషాద సమయంలో ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు, ఆయన స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' - తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
 
'ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర మరణం అత్యంత విషాదకరం. సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం, అభిమానులకు ఆ శ్రీరాముడు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా' - ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
 
'ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలితరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, సీతా ఔర్ గీత, యాదోం కి బారాత్ లాంటి చిత్రాలతో నటనలో తనదైన శైలి చూపించారు. ధర్మేంద్ర కుమారులు సన్నీ దేవోల్‌, బాబీ దేవోల్‌, సతీమణి హేమమాలినికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' - పవన్ కల్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం