మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలని, ముఖ్యంగా మా మెంబర్స్ అయ్యుండి అవకాశాలు లేని ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరుకుంటూ సోమవారం ఉదయం 10 గంటలకు మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరపున ప్రెసిడెంట్ డా.వి.కె.నరేష్, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ హేమ, అలీ, రాజారవీంధ్ర, ఉత్తేజ్, సురేష్ కొండేటి, అనితా చౌదరి, జయలక్ష్మి, అశోక్ కూమార్, టార్జాన్ తదితరులు కలిసి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ సుప్రియని, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్‌ని, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్‌ని, తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ.. మా సభ్యులుగా ఉన్న చాలా మంది వేషాలు లేక బాధపడుతున్నారని వారి కోసం మేమందరం కలిసి ఈ నాలుగు ఆర్గనైజేషన్లను కలవడం జరిగిందని చెప్పారు. ఇదే సందర్భంగా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మా మెంబర్స్‌గా ఉన్న వాళ్ళు చాలా మంది వేషాలు లేక ఖాళీగా ఉంటున్నారని, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా వేషాలు లేక చాలా బాధల్లో ఉన్నారని చెప్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కోసం మేము ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా ప్లాన్ చేస్తున్నామని, ఆ వెబ్‌సైట్‌లో దాదాపు అందరి ఆర్టిస్టుల అడ్రెస్‌లు, ఫోన్ నెంబర్లతో పాటు వాళ్ళు చేసిన ఒక్క నిమిషం పెర్ఫార్మెన్స్ వీడియో తదితర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హీరో డా.రాజశేఖర్ మాట్లాడుతూ.. మేము కలిసిన నాలుగు ఆర్గనైజేషన్స్ వాళ్ళు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నటీనటులందరికీ సహకరిస్తామని అంతేకాకుండా మేము నాలుగు ఆర్గనైజేషన్స్ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా కి పూర్తి సహకారం ఇస్తామని సహృదయంతో ప్రతిస్పందించారని, వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.