తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆరోపణలు ఎదుర్కొన్న సినీ ప్రముఖుల్లో ఏ ఒక్కరికీ ఈ డ్రగ్స్ దందాతో సంబంధం లేనట్టు పేర్కొన్నట్టు సమాచారం.
ముఖ్యంగా, ప్రధాన నిందితుడు కెల్విన్ ఆరోపించినట్లుగా టాలీవుడ్‌కు చెందిన కొందరు నటులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాల్లేవని, అతడు తప్పుదోవపట్టించాడంటూ కోర్టుకు నివేదించింది. గత ఏడాది డిసెంబరు 28న దర్యాప్తు అధికారులు కెల్విన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ తాజాగా బయటకు వచ్చింది.
చార్జిషీట్ దాఖలై పది నెలలు అయ్యాక.. ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అది లీకవ్వడం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ వ్యవహారంలో 2017లో 12 మంది సినీ ప్రముఖులను విచారించిన ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. చార్జిషీట్‌లో మాత్రం పూరి జగన్నాథ్(పెట్ల జగన్నాథ్), తరుణ్ పేర్లను మాత్రమే పేర్కొంది. మిగతా వారి పేర్లను ఎక్కడ ప్రస్తావించలేదని తెలుస్తోంది.