తెలుగు రాష్ట్రాల్లోని ఏదేని రెండు జిల్లాలకు స్వర్గీయ ఎన్.టి.రామారావు పేరు పెట్టాలని ప్రముఖ దర్శక నిర్మాత, ఎన్టీఆర్ వీరాభిమాని వైవీఎస్ చౌదరి కోరారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఏవైనా రెండు జిల్లాలకు ఎన్టీయార్ పేరు పెట్టాలని, ఎన్టీయార్‌కు 'భారతరత్న' వచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాలను కోరారు. 'ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించటమేకాక, ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎన్టీయార్ ఎందరికో స్ఫూర్తినిచ్చారు. హైందవ సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన 'మహాభారతం', 'భాగవతం', 'రామాయణం'లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేశారు. 60 ఏళ్ల వయస్సులో కొన్ని వందల కిలోమీటర్లు చైతన్యరథంపై ప్రయాణం చేసి ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు.
'మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణ శక్తి సాధ్యమా' అని భావితరాలు ఆశ్చర్యపోయేలా, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక కారణజన్ముడిలా, యుగపురుషుడిలా, ఓ దైవంలా అవతరించారు. ఎన్టీయార్ నాకు దేవుడు. ఎంతోమందికి దైవ సమానుడు. ఆయన దివ్య మోహనరూపమే నన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది. ఆయన ఆశయాల స్ఫూర్తితోనే నేను ఇక్కడ నిలబడ్డాను. నేనిక్కడ పొందిన కీర్తి, సంపాదిస్తున్న ప్రతీ పైసా ఆయన అకౌంట్ నుంచి డ్రా చేసుకుంటున్నట్టే భావిస్తాను'.
నేనే కాదు.. అమలాపురంలోని రిక్షాపుల్లర్ నుంచి, ఎక్కడో అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకూ ఆయన అభిమానులే. తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన ఆ మహాపురుషుని జ్ఞాపకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ఎన్టీయార్ పేరు పెట్టాలని, ఆయన్ని 'భారతరత్న' బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారత ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతున్నాను' అంటూ వైవీఎస్ తన లేఖలో పేర్కొన్నారు.