దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వైరస్ వణుకు పుట్టిస్తుంది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తుంది. ఇందులోభాగంగా, థియేటర్లతోపాటు విద్యా సంస్థలను మూసివేతకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు థియేటర్లు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
ఇకపోతే, మహారాష్ట్రలోనూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లోవున్నాయి. మహారాష్ట్రలో అయితే, 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లలో సినిమాల ప్రదర్శన సాగుతోంది.
దీంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది పెద్ద దెబ్బే. ముఖ్యంగా, వచ్చే నెల 7వ తేదీన విడుదలకానున్న "ఆర్ఆర్ఆర్", ఆ తర్వాత విడుదలయ్యే "రాధేశ్యామ్", "వలిమై" వంటి చిత్రాలపై తీవ్రప్రభావం చూపనుంది.