మాటల మాంత్రీకురాలు, బుల్లితెర స్టార్‌మహిళ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే6 సినిమా విడుదలకానుంది
జయమ్మ పంచాయతీ విడుదల ఏర్పాట్లలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు?
అవునండీ... ఈరోజు మా శ్రీకాకుళం, టెక్కలి పరిసర ప్రాంతాలలో ప్రచారాన్ని నిర్వహించాం. 300 మందితో బైక్ ర్యాలీ, 500మందితో జయమ్మ జెండాలతో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నాం.
దర్శకుడు కథ చెప్పినప్పుడు మీరు జయమ్మ పాత్రకు ముందుగా ఎవరినైనా అనుకున్నారా?
నేనైతే సుమగారి పేరే చెప్పాను. మరో నటి ఆలోచనరాలేదు. సుమగారు కాకపోతే సినిమా చేయనని చెప్పేశాను. యాంకర్‌గా ఆమె క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆమెకు రెండు రాష్ట్రాలలోనేకాదు అమెరికాలోనూ తెలీని గడపలేదు.
శ్రీకాకుళం లోకల్ నటీనటులు నటింపజేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
మా ప్రాంతం చాలా ప్రత్యేకతలు వున్నాయి. ఇక్కడి మనుషులు విశాల మనస్కులు. అందుకే వారి పాత్రలు వారే చేస్తే కథకు మరింత బలం వస్తుందని అనుకున్నాం. అనుకున్నట్లు చక్కటి నటన కనబరిచారు.
మీ సినిమా ప్రచారంలో చిత్ర పరిశ్రమంతా ఒకే తాటిపై వుంది. మీకెలా అనిపిస్తుంది?
ఒక మంచి చిత్రానికి చిత్ర పరిశ్రమ అండగా నిలవడం నాలాంటి ఔత్సాహిక నిర్మాతలకు ఎంతో ప్రోత్సాహాన్నినచ్చింది. మా చిత్ర ముందస్తు ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, రాంచరణ్, రానా, నాని బాగస్వాములయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాగార్జున, నాని హాజరయ్యారు. సుమ ప్రధాన పాత్ర పోషించడం వలన చిత్రం పై అంచనాలు పెరిగాయి.
రాజమౌళి, రాఘవేంద్రరావు ఫంక్షన్‌కు రాలేదని సుమగారు కాస్త అలిగారు. అది వైరల్ అయింది? అసలేం జరిగింది?
సుమగారంటే అందరికీ గౌరవమే. ఆమె మాటల మాంత్రీకురాలు. మహిళాలోకం ఆమె వెంట వుంది. రాజమౌళిగారికి సుమగారంటే విపరీతమైన అభిమానం. అలాగే చిరంజీవిగారుకూడా ఓ సారి ఆమె గురించి చెబుతూ, అందరూ నాకు ఫ్యాన్స్ అయితే నేను నీకు ఫ్యాన్ అని అన్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్నవారంతా సుమగారితో ఫొటో తీశాకే పనులు చేస్తామని అన్నారంటే ఆమె అంటే ఎంత అభిమానమో అర్థమయింది. అందుకు రామ్ చరణ్, చిరంజీవిగారు కూడా వారిని ఎంకరేజ్ చేశారు.
సీతంపేట ప్రాంతానికి వెళ్లి షూటింగ్ చెయ్యడానికి గల కారణాలు?
మా పల్లెలు ప్రకృతి స్థావరాలు. మా ప్రాంత యాసను నవ్వుకునే వారు పలకడం ప్రయత్నిస్తే అంత సులువేం కాదు. ఈ యాసను సుమ నేర్చుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక్కడ సెట్ వేస్తే ఒరిజినాలిటీ రాదు. సహనటులకి మా యాస నేర్పడం మరింత శ్రమ అవుతుంది. మా జిల్లాలో రంగస్థల కళాకారులకు మంచి అవకాశం కల్పించడం కూడా నా బాధ్యత . సుమ ఆ ప్రాంతంలో షూటింగ్‌కి అంగీకరించడంతో కథనానికి మరింత బలం చేకూరింది
పరిశ్రమకు కొత్త అయినా మీ గురుంచి నటులంతా ఎంతో గొప్పగా చెబుతున్నారు ?
అదంతా వారి అభిమానమే. వారి మంచి మనసుకు కృతజ్ఞతలు. మా సంస్కృతి, సంప్రదాయం సాటిమనిషిని ఆదరించడమే. జిల్లాలుగా విడబడినా సీతంపేట మా ప్రాంతగానే గుర్తింపు. అక్కడి కల్మషం లేని మనుషులు, ప్రపంచంలో మరెక్కడా కనిపించని ప్రకృతి అందాలు చిత్ర బృందానికి నన్ను దగ్గరివాడ్ని చేశాయి. ఇకపై మా ప్రాంతంలో చిత్ర నిర్మాణాలు జరుగుతాయని ఆశిస్తున్నా
జయమ్మ పంచాయతీ ఎలా ఉండబోతుంది ?
ఇదొక కావ్యం. ప్రతి మహిళ అంతరంగం. ప్రతి గుండెను తాకుతుంది. కె.విశ్వనాధ్, జంధ్యాల, బాపు వంటి దర్శక దిగ్గజాల చిత్రాల సరసన నిలిచే మానవీయ కవనిక అవుతుంది. మా బ్యానర్‌కు చిరస్థాయిగా చెప్పుకునే చిత్రం అవుతుంది. ఒక్క మాటగా చెప్పాలంటే సుమమ్మ ఇకపై జయమ్మ అవుతుంది.. అంత బాగుంటుంది
నిర్మాణ బాధ్యతల్లో ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి...
మా సంస్థకు ఇది రెండవ చిత్రం. అయితే ఈ చిత్రం వంద చిత్రాల ఆనుభవాన్ని ఇచ్చింది. కోవిడ్ కారణంగా షెడ్యూల్ తరచూ మారుతుండేది. నిర్మాణ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఇవన్నీ చిత్ర పరిశ్రమ నుంచి లభించిన ఆదరణతో మర్చిపోయా. కీరవాణి మా చిత్రానికి సంగీతం సమకూర్చడం మర్చిపోలేని అనుభూతి. బాహుబలి, RRR చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆయన మాకోసం ఆయన సమయం కేటాయించడం గొప్ప అనుభూతి. పెద్ద హీరోలంతా మాకోసం వారి సమయాన్ని కేటాయించి అండగా నిలవడం నాకు గొప్ప ధైర్యాన్నిచ్చింది. మంచి కథనం తో విజయకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందన్న నమ్మకం మాలో బలంగా ఉంది. ఈ చిత్రం చిన్న చిత్రాలకు దిశానిర్దేశం చేయగలదు.
మీ జిల్లా గురించి ఫంక్షన్‌లో గొప్పగా చెప్పారు. అసలు ప్రత్యేకతలు ఏమిటి?
ఎత్తయినా కొండలకు, లోతైన సముద్రానికి మధ్యలో ఉంది ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంద్ర లో ఉత్తమ మైనది శ్రీకాకుళం జిల్లా. బలమైన జీడీ పప్పుకి, రుచికరమైన పనస తొనలకి మాజిల్లా పెట్టింది పేరు.
దేశం లో చాలా ప్రసిద్ధి చెందిన సూర్యనారాయణ దేవాలయం, ప్రపంచం లో ఎక్కడ లేని శ్రీకూర్మం క్షేత్రం మాజిల్లాలో ఉన్నాయి. కవులు , పండితులు, ఎంతో ప్రసిద్ధి చెందిన మహాను భావులు మాజిల్లానుండి ఉన్నారు. నిరాడంబరం, నిజాయతి, నిర్భయం మా జిల్లా
క్రీస్తు పూర్వం మాజిల్లా లో గొప్ప నాగరికత విరాజిల్లింది. కళింగ పట్నం ఒకప్పుడు గొప్ప వాడరేవు గా భాసిల్లింది. శ్రీముఖలింగాన్ని రాజధానిగా చేసుకొని ఎన్నో రాజ వంశాలు కళింగ రాజ్యాన్ని పరిపాలించాయి. అంత గొప్ప ప్రాంతం నుండి వచ్చాను నేను. ఒక గొప్ప సాంస్కృతికి, నాగరికత కు వారసునిగా మీ ముందు నేను నిలబడ్డాను.
ఎన్ని సెంటర్లలో విడుదలకాబోతోంది?
ఆంధ్ర, తెలంగాణలో మంచి సపోర్ట్ వుంది. వై.సి.పి. నాయకుడిని అని కాకపోయినా మంచి థియేటర్లు మాకు దక్కాయి. అలాగే తెలంగాణాలోనూ మంచి సపోర్ట్ వుంది. కుటుంబమంతా కలిసి హాయిగా చూసే సినిమా మా జయమ్మ పంచాయితీ.