Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పద్మవిభూషణ్' పురస్కార గ్రహీత చిరంజీవిని కలిసిన 'పద్మశ్రీ' గ్రహీతలు

padma awardees

వరుణ్

, మంగళవారం, 30 జనవరి 2024 (18:49 IST)
మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అన్నయ్య చిరంజీవి తీరే వేరు కదా.. అందరూ తన ఇంటికి వచ్చి విషెస్ చెబుతుంటే.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకరుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్.ఆనందచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. 
 
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో నిర్వహించిన ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1994 తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభ పురస్కారం, 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్నారు. 2017లో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 
 
యాదాద్రి ఆలయాన్ని సంపూర్ణంగా కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో డాక్టర్‌ ఆనందచారి వేలు కీలకంగా వ్యవహరించారు. ప్రధాన స్థపతి హోదాలో ఆయన రాతి శిల్ప రూపకర్తగా అహర్నిశలు కృషి చేశారు. అష్టభుజి మండప ప్రాకారాలు కాకతీయ, ద్రవిడ, చోళ శిల్పకళా రీతిలో తీర్చిదిద్దేందుకు కష్టపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్ప కళాశాలలో తొలిదశలో శిక్షణ పొంది, ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.   
 
అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్యకి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందకరమని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  
 
అలాగే శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. శిఖరాగ్రస్థాయిలో ఉన్న చిరంజీవి తమను వారి ఇంటికి ప్రత్యేక ఆహ్వానం పంపించి, సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని సమ్మయ్య, వేలు సంతోషం వ్యక్తంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి కోసం యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్న రామ్ లక్ష్మణ్