సినిమా తీయాలంటే ముందు నిర్మాత కావాలి. ఆయనే లేకపోతే నటీనటులు ఎంతవున్నా వేస్టే. కానీ నిర్మాత లేకుండా సినిమా తీయాలనే కుతూహలంతోపాటు అందులోని పాత్ర కోసం ఇప్పటికే బరువు తగ్గించుకుంటూ కసరత్తులు చేస్తున్న వ్యక్తి హైదరాబాద్‌లో వున్నాడు. ఆయన ఓల్డ్ సిటీలో బిజెపి నాయకుడు ఎమ్మెల్యే రాజాసింగ్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాజాసింగ్ సినిమాలవైపు మళ్ళాడు. ఆ సినిమాను హిందీ, మరాఠీతోపాటు తెలుగులోకూడా విడుదలచేయాలనే ప్లాన్‌లో వున్నాడు.
ఇక వివరాల్లోకి వెళితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుమారుడు శంభాజీ గురించి మాత్రం పెద్దగా తెలియదు. ఈయన శివాజీ కంటే ప్రమాదకరమైన నాయకుడు. శివాజీ మరణించిన తర్వాత ఔరంగజేబు సామ్రాజ్యంపై శంభాజీ దాడి చేసి 120 కోటలను స్వాధీనం చేసుకున్నారు. శంభాజీ చరిత్ర చాలా బాగుంది. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలనీ, అందులో నేనే నటించాలని అనుకున్నానని చెప్పాడు రాజా సింగ్. అంతేకాదు ఈ సినిమా కోసం తన బరువు 170 కేజీలు ఉంటే 90 కేజీలకు తగ్గినట్లు చెప్పాడు. శంభాజీ పాత్ర కోసం అప్పట్లో ఆయన ఫిజిక్ ఎలా ఉండేదో అలాంటి బాడీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగు, హిందీ, మరాఠీ సహా మొత్తం 4 భాషల్లో సినిమా తీయనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నామని రాజా సింగ్ చెప్పారు. నిర్మాత దొరికితే వెంటనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సినిమా తీసేంత ఆర్థిక స్థోమత తనకు లేదని ఒకవేళ ఉంటే తానే స్వయంగా శంభాజీ చిత్రాన్ని నిర్మించేవాడినని తెలిపారు. అందరి మాదిరి తన సినిమాలలో హీరోయిన్లతో పాటలు ఉండవనీ, కామెడీ సన్నివేశాలు కనిపించవనీ కేవలం యాక్షన్ మాత్రమే ఉంటుందని చెబుతున్నాడు. మరి ఈ సినిమాకు పార్టీ వారే పెట్టుబడిపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.