దేశంలో కరోనా వైరస్ రోగుల మృతులపై బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చాలా మంది కరోనా భయం, మెంటల్ యాంగ్జైటీతో ప్రాణాలు కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కరోనా రోగులు త్వరగా కోలుకోవాలంటే ధైర్యమే సగం బలం అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
ఇందులో ఆమె ఏం మాట్లాడారంటే.. 'కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి పెరగడంతో ప్రజల పరిస్థితి మరింత కష్టంగా మారింది. తెలియని దానికోసం భయపడడం, టెన్షన్ తెచ్చుకోవడం వల్ల లోలోపలే మనం నలిగిపోతున్నాం. అదే మరణానికి దారి తీస్తుంది. నా తండ్రికి కరోనా సోకిన సమయంలో భయపడుతూ ఏం జరిగిపోతుందో అన్న యాంగ్జైటీ సమస్యతో ఐసీయూలో చేరారు.
22 రోజుల తర్వాత మరణించారు. నాతో ఉండే కజిన్స్ కూడా ఇలాంటి సమస్యతోనే భయపడేవారు. వారందరికీ పాజిటివ్‌గా ఉండమని చెప్పా. మనం ఆరోగ్యంగా, భయం లేకుండా ఉండాలంటే కరోనాకు సంబంధించిన న్యూస్ చూడడం మానేయాలి.
ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపండి. ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు సన్నిహితులతో వీడియో కాల్‌లో కనెక్ట్ అవ్వండి. హెల్తీఫుడ్ తీసుకోండి. వ్యాయామాలు చేయండి. ప్రశాంతంగా పడుకోండి. దాని వల్ల మనలో ఇమ్యూనిటీ స్టాండ్ పెరుగుతుంది. యాంగ్జైటీ డిసీజ్ ఉన్నవాళ్లు డాక్టర్‌ని కలవండి. మెంటల్ హెల్త్ కేర్ వర్కర్స్ సజెషన్స్ తీసుకోండి' అంటూ ఆమె హితవు పలికారు.