టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. అమ్మతోడు.. తనకు రాజకీయాలకో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత టికెట్ దక్కకపోవడంతో 2019లో పార్టీని వీడారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, బండ్ల గణేశ్ మళ్లీ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని, త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన ఆయన.. మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు లేదని, తానిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, గతంలో తాను మాట్లాడిన మాటలను దయచేసి ఇప్పుడు పోస్టు చేయొద్దని గణేశ్ అభ్యర్థించారు.
కాగా, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు మొర్రో అని బండ్ల గణేశ్ ఎంత మొత్తుకున్నా పుకార్లకు మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారని, గణేశ్ కూడా కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు అలానే అంటారని, మళ్లీ మనసు మార్చుకుంటారంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.