ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్‌లో తనకు గుడి వుందని అందువల్ల తన అభిమానులు దక్షిణాదిలో కూడా తనకు ఓ గుడి కట్టాలంటూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. బద్రీనాథ్‌లో తనకు ఓ గుడి కట్టారని, అందువల్ల బద్రీనాథ్ వెళ్లిన భక్తులు తన గుడిని కూడా సందర్శించాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బద్రీనాథ్‌లోని పలువురు పూజారులు మండిపడుతున్నారు. ఊర్వశికి బద్రీనాథ్‌లో గుడి లేదూ గాడిద గుడ్డూ లేదంటున్నారు. నటి ఊర్వశి ప్రతి ఒక్కరినీ తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఊర్వశీ రౌతేలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో తన పేరుమీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ వర్శిటీలో కూడా నా ఫోటుకు పూలమాలలు వేసి నన్ను దండమమాయి అని పిలుస్తుంటారు అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై అర్చకులు లేదా పూజారులు మండిపడుతున్నారు. బద్రీనాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, ఆ ఆలయానికీ నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీదేవి ఆలయంగా మారిందని చెబుతుంటారు. నటి ఊర్వశీ మాత్రం ఆలయం తన పేరుమీద ఉందని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
పైగా ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఊర్వశీ వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే కఠినంగా వ్యవహించాల్సిందే" అని అన్నారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని బ్రహ్మకపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ పేర్కొన్నారు.