'అర్జున్ రెడ్డి' నటితో హీరో విశాల్ పెళ్లి... వరలక్ష్మి సంగతేంటి?

బుధవారం, 16 జనవరి 2019 (09:48 IST)
కోలీవుడ్ హీరో, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రంలో కీర్తి పాత్రలో నటించిన అమ్మాయి అనీషా రెడ్డి. ఈమెను విశాల్ పెళ్లి చేసుకోనున్నాడు. 
 
ఈ విషయాన్ని విశాల్ తండ్రి జీకే రెడ్డి స్వయంగా వెల్లడించగా, అనీషా రెడ్డి కూడా తమ పెళ్లి వార్తను ధృవీకరించింది. ఇందుకు సంబంధించి తాను, విశాల్ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇపుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. 
 
అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె. ఈమె 'అర్జున్‌ రెడ్డి', 'పెళ్లి చూపులు' వంటి చిత్రాల్లో నటించారు. 'అర్జున్‌ రెడ్డి' సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు. 
 
మరోవైపు, సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్‌తో విశాల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లికి శరత్ కుమార్ దంపతులు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, అవన్ని వట్టి పుకార్లేనని ఈ తాజా ప్రకటనతో తేలిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌కు సీక్వెల్ : అనిల్ రావిపూడి వెల్లడి