తన హత్యకు ఏకంగా ఓ టీవీలోనే కాంట్రాక్టులు ఇవ్వడం చూసి టెర్రరిస్టులు కూడా షాకవుతారని వ్యాఖ్యానించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఓ టీవీ ఛానల్లో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ... రాంగోపాల్ వర్మ తలను తెచ్చినవారికి కోటి రూపాయలు ఇస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వ్యూహం సినిమా గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై దర్శకుడు వర్మ ఈరోజు సాయంత్రం డిజిపికి ఫిర్యాదు చేసారు.
తనను హత్య చేసేందుకు బహిరంగంగా ఓ టీవీ ఛానల్లో కాంట్రాక్టు ఇచ్చినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తను చిత్రీకరించిన వ్యూహం సినిమాతో తెలుగుదేశం పార్టీ వణికిపోతోందనీ, ఇప్పటివరకూ తన హత్య కాంట్రాక్టు వ్యవహారం గురించి తెదేపా నాయకులు చంద్రబాబు, లోకేష్ స్పందించలేదనీ, పవన్ కల్యాణ్ కూడా మాట్లాడలేదంటే వాళ్ల ప్లాను కూడా తనను చంపేయడమే అయి వుండవచ్చని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.