హైదరాబాద్ నగరంలో ఉగ్ర లింకు డొంక కదిలింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భాగ్యనగరికి వచ్చి ఐదుగురు ఉగ్ర అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బయోటెక్నాలజీ విభాగం అధిపతి కాగా, మరొకరు దంత వైద్యుడు.. ఇంకొకరు ఆటో డ్రైవర్ కావడం గమనార్హం. డెంటిస్ట్ నుంచి ఆటో డ్రైవర్ వరకు ఐదుగురు వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. వీరిలో ఒకరు తన పేరును మహ్మద్ అబ్బాస్ కాస్త వేణు కుమార్ పేరు మార్చుకున్నాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో హైదరాబాద్ నగరంలో ఓ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఈయన పేరు మహమ్మద్ సలీం. భోపాల్‌కు చెందిన ఈయన కొన్ని రోజులుగా గోల్కొండలో ఉంటున్నట్టు గుర్తించారు.
అలాగే, ఒరిస్సాకు చెందిన అబ్దుల్ రహమాన్‌ను క్లౌడ్ సర్వీసెస్ ఇంజనీర్‌గా గుర్తించారు. ఈయన కూడా గోల్కొండలోనే ఉంటున్నారు. గోల్కొండ బజార్‌కు చెందిన షేక్ జునైద్ ఓ దంతవైద్యుడుగా పని చేస్తున్నాడు. హఫీజ్ నగర్‌కు చెందిన మహహ్మద్ అబ్బాస్ అలీ ఆటో డ్రైవర్‌గా, జగద్గరిగుట్టలోని మగ్ధూమ్ నగర్‌కు చెందిన మహ్మద్ హమీద్‌గా గుర్తించగా, ఆయన రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు.
అదేవిధంగా జవహర్ నగర్ బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నట్టు తెలంగాణ నిఘా వర్గాలు వెల్లడించాయి. భోపాల్‌కు చెందిన 11 మంది ఉగ్రవాదులతో కలిసి ఈ ఆరుగురు పనిచేస్తున్నట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మతమార్పిడి చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు మహమ్మద్ సలీం పేరు సౌరభ్ వైద్య. అబ్దుల్ రహమాన్ పేరు దేవీ ప్రసాద్.
మహమ్మద్ అబ్బాస్ పేరు వేణుకుమార్‌గా ఉన్నారు. వీరు మతం మార్చుకున్నారా? లేక పేర్లు మార్చుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఎంపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఈ 11 మందిని అరెస్టు చేసింది. అలాగే తమిళనాడులో కూడా మరో ఐదుగురు ఉగ్ర అనుమానితులను జాతీయ దర్యాప్తు బృందం ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు.