పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ మంగళవారం పరామర్శించారు. ఆ బాలుడు చికిత్స పొందుతున్న హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి ఆయన మంగళవారం చేరుకుని శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ తొక్కిసలాటలో భార్యను కోల్పోయిన రేవతి భర్త భాస్కర్‌ను అల్లు అర్జున్ పరామర్శించారు.
తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆస్పత్రిలోనికి వెళ్లిన పుష్పరాజ్... సుమారు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్‌తోనూ మాట్లాడారు.
మరోవైపు ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లొద్దని లీగల్ టీమ్ చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు.
గత నెల 4న 'పుష్ప2' బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆ బాలుడిని కిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఆర్థికసాయం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.కోటి, పుష్ప నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షల చెక్కులను ఇటీవల దిల్ రాజు ద్వారా ఆ కుటుంబానికి అందజేశారు.