హీరో అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు కోరనున్నారు. ఈ మేరకు వారు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాను నటించిన "పుష్ప-2" చిత్రం రిలీజ్‌ను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ అర్థరాత్రి ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ షోను తిలకించేందుకు హీరో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో వచ్చారు. థియేటర్‌కు ఆయన ర్యాలీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దీనిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా, హీరో అల్లు అర్జున్ ఏ11 నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయగా, అదే రోజు సాయంత్రానికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పత్రాల చేరికలో జాప్యం చోటు చేసుకోవడంతో అల్లు అర్జున్ ఓ రాత్రి జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయాన్ని ఆయన చంచల్‌గూడ జైలు విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
ఇదిలావుంటే తెలంగాణ పోలీసులు ఈ బెయిల్ రద్దు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్‌కు వెళ్ళేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదనే రిపోర్టు సోమవారం వెలుగులోకి వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించనున్నట్టు తెలుస్తుంది. ఒక వేళ హైకోర్టు గనుక బెయిల్ రద్దు చేస్తే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లాల్సివుంటుంది.