ఆస్కార్ అకాడెమీ ఆహ్వానితుల జాబితాలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్ల పేరు చోటుదక్కించుకున్నాయి. నిజానికి ఈ యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. ఈ వేడుకలను 2021, ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
అయితే, ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), ప్రతి ఏడాది అనేక మంది ప్రపంచ సినీ ప్రముఖులను అకాడమీలోకి ఆహ్వానిస్తుంది. 2020 సంవత్సరానికిగాను అకాడమీ జాబితాలో చేరబోయే సభ్యుల వివరాలని ఏఎంపీఏఎస్ ప్రచురించింది.
ఇందులో భాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన హృతిక్ రోషన్, అలియా భట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియ స్వామినాథన్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ విషాల్ ఆనంద్ (వార్, భారత్), సందీప్ కమల్ (పానిపట్, జల్) తదితరులు ఈ ఏడాది అకాడమీ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. మొత్తం 819 మంది సభ్యులని జాబితాలో చేర్చగా, వివిధ క్యాటగిరీలు ఆధారంగా ఎంపిక చేశారు.
గతంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ సినీ ప్రముఖులు ఏఆర్ రెహ్మాన్, ఇర్ఫాన్ ఖాన్, రేసుల్ పూకుట్టి, ఫ్రీడా పింటో, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే తదితరులు అకాడమీ సభ్యులుగా ఉన్న విషయం తెల్సిందే.