'సమ్మోహనం, వి' చిత్రాల తర్వాత మరోసారి సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో నటిస్తున్నాడు. అదే సమయంలో 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్'లో నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు మణిశర్మ స్వరాలు అందిస్తుండగా, ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోదావరిలోకి మరబోటులు శబ్దం చేసుకుంటూ వెళుతుంటే... అందులో ఓ బోటులో హాయిగా సుధీర్ బాబు కునుకేస్తూ ఉన్నాడు. ఎండ వేడి ముఖం మీద పడకుండా... అసిస్టెంట్ గొడుగు పట్టుకున్నాడు.
అంతే హీరోగారికి... ఆ గోదారి చల్లగాలి తగిలి మంచి కునుకు పట్టేసినట్టుగా ఉంది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీజీవులకు కరువు అనేది ఏదైనా ఉందంటే అది కంటి నిద్ర మాత్రమే. దానిని ఇలా మరపడవ మీద సుధీర్ బాబు తీర్చుకోవడంలో వింతేం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.