అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఆయన ప్రధాన సలహాదారు కిమ్ యో జోంగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియాతో అమెరికా సైనిక విన్యాసాలు చేపట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కిమ్ యో.. 'మీరు వచ్చే నాలుగేళ్లు హాయిగా నిద్ర పోవాలనుకుంటే రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని' బైడెన్‌ను హెచ్చరించారు. లేనిపక్షంలో సైనిక ఉద్రిక్తతలు తగ్గించేలా 2018లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని కూడా సమీక్షించాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
"మీరు వచ్చే నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే రెచ్చగొట్టే పనులు మానుకోండి. మళ్లీ మొదటి నుంచి ఆ పనులు మొదలెట్టకండి. అవి తర్వాత మీకు నిద్రలేకుండా చేస్తాయి." అని కిమ్ యో అన్నారు. అలాగే దక్షిణ కొరియా వైఖరిపై కూడా తాము ఓ కన్నేసి ఉంచుతామని, వారు మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే అసాధారణ చర్యలకు సైతం వెనుకాడబోమని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు డ్రాగన్ కంట్రీ చైనా, ఉత్తర కొరియాలకు వ్యతిరేకంగా సానుభూతి కూటమి కోసం పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిత్ర దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలో కీలక పర్యటనలను సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది.
కాగా.. ఇప్పటికే అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ ప్రధాన శత్రువు అమెరికానే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్ ఇలా అగ్రరాజ్యమే తమ ప్రధాన శత్రువు అని పేర్కొన్నారు. ఇక కిమ్ యో తాజా వ్యాఖ్యలపై బైడెన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.