హైదరాబాద్ నగరంలో కామంతో కళ్లు మూసుకునిపోయిన ఓ కామాంధుడు వరుసకు సోదరి అయిన యువతిని మానభంగం చేశాడు. బాధితురాలు ఎయిర్‌హోస్టెస్‌గా శిక్షణ తీసుకుంటుంది. అత్యాచారం చేయడమేకాకుండా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. దీంతో బాధిత యువతి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఆ కామాంధుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాత్మాగాంధీ నగర్‌లో నివసించే బాధిత యువతి(22) ఎయిర్‌హోస్టెస్‌గా శిక్షణ పొందుతుంది. తన తల్లి సోదరి కొడుకు నిఖిల్ కర్ణాటకలో నివసిస్తున్నాడు.
ఇటీవల నిఖిల్(27) హైదరాబాద్‌కు వచ్చి మహాత్మాగాంధీ నగర్‌లో అద్దెకుంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. అవసరం నిమిత్తం బాధిత యువతి నిఖిల్‌కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది.
ఈ నెల 2వ తేదీన ఆ డబ్బు ఇస్తానని బాధితురాలిని నిఖిల్ తన గదికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చాడు. విషయం తెలియని ఆ యువతి దాన్ని సేవించగా అపస్మారక స్థితిలోకి జారుకుంది.
ఆ తర్వాత ఆ యువతి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో కూడా తీశాడు. ఈ నెల 4వ తేదీన బాధితురాలు తన డబ్బు ఇవ్వాలంటూ నిలదీయగా, వీడియోను చూపించి బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. అంతేకాదు తాను రెండో తేదీన అత్యాచారం చేశానని ఎవరికైనా చెబితే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
దీంతో షాక్‌గురై ఆందోళన చెందిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376, 506ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలియగానే నిఖిల్ కనిపించకుండా పోయాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.