ఆర్తి అగర్వాల్ ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్తి అగర్వాల్ అగర్వాల్ 37వ జయంతి నేడు. తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం ద్వారా తన 16వ యేట టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాలో వెంకటేష్ సరసన నటించింది.
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆర్తి అగర్వాల్.. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది. అంతేకాదు ఈమె తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది.
ఆర్తి అగర్వాల్ అనుకోకుండా జూన్ 6 న 2015వ సంవత్సరంలో మరణించింది. ఆర్తి అగర్వాల్ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్న సమయంలోనే అనుకోకుండా బరువు పెరిగింది. ఈ కారణంగా ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు ఆమె పర్సనల్ విషయాల్లో కూడా కాస్తా డిస్ట్రబ్ అయ్యిందని టాక్. ఓ వైపు పర్సనల్ రీజన్స్.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు తగ్గడం ఆమెను కలచివేశాయి. దాంతో ఆర్తి అగర్వాల్ తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు చేయడం మొదలు పెట్టింది.
అందులో భాగంగా బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసక్షన్ ఆపరేషన్‌ని కూడా చేయించుకుంది. అయితే ఈ సర్జరి తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది. ఇక ఆర్తి అగర్వాల్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.
వెంకటేష్ వసంతం, చిరంజీవి ఇంద్ర, తరుణ్ నువ్వు లేక నేను లేను, ఉదయ్ కిరణ్ నీ స్నేహం, రవితేజ వీడే, ఎన్టీఆర్ అల్లరి రాముడు, ప్రభాస్ అడవి రాముడు, నాగార్జున నేనున్నాను తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.
అర్తి అగర్వాల్.. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ ఫ్యామిలీలో న్యూజెర్సీలో మార్చి 5, 1984న జన్మించింది. తల్లిదండ్రులు వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్. ఇక ఆమె సినీరంగ ప్రవేశం విషయానికి వస్తే.. 14 సంవత్సరాల వయసులో మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది అర్తి అగర్వాల్.
ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్ షోలో ఆర్తీ అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. అలా అర్తి అగర్వాల్ 2001వ సంవత్సరంలో హిందీలో పాగల్‌పన్ అనే సినిమాలో నటించింది. ఆపై దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నటించి అదరగొట్టింది. హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కానీ చిన్న వయస్సులోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.