Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలీ ‘యమలీల’ చిత్రానికి పాతికేళ్లు..!

Advertiesment
అలీ ‘యమలీల’ చిత్రానికి పాతికేళ్లు..!
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (18:55 IST)
అలీని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎస్.వి.కృష్ణ రెడ్డి డైరెక్షన్లో కిషోర్ రాఠీ సమర్పణలో మనిషా బ్యానర్ పైన కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘యమలీల’ చిత్రం ఈ నెల 28తో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉండడం విశేషం. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘యమలీల’ చిత్రాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 
 
తల్లిని దేవతలా ఆరాధించే కొడుకు పాత్రలో అలీ నటన అద్భుతం అని చెప్పాలి. అలాగే తల్లి పాత్రలో మంజుభార్గవి బాగా రాణించారు. సినిమా ఆద్యంతం సెంటిమెంట్ వుంటూనే సందర్భానుసారంగా వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. యమధర్మరాజుగా సత్యనారాయణ, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం, తోట రాముడుగా తనికెళ్ళ భరణి, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కోట శ్రీనివాసరావు, అలీ అసిస్టెంట్‌గా గుండు హనుమంతరావు… ఇలా సినిమాలోని చాలా క్యారెక్టర్స్ ఆడియన్స్‌ని నవ్వుల్లో ముంచెత్తాయి. 
 
ఈ సినిమాలోని పాటలు కూడా ఎంతో ఆదరణ పొందాయి. ఈ సినిమాలోని ‘సిరులొలికించే చిన్ని నవ్వులే..’ పాట సెంటిమెంటల్‌గా ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకుంటుంది.
 
 సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఎస్.వి.కృష్ణారెడ్డి అందించిన సంగీతం, చిత్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. అలీ, ఇంద్రజ మధ్య వచ్చే ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లోడో..’ పాట మాస్ ఆడియన్స్‌ చేత స్టెప్పులు వేయించింది. ఈ సినిమాకి మరో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే సూపర్‌స్టార్ కృష్ణ ఓ మెరుపు పాటలో కనిపించడమే. ‘జూంబారే జుజుంబరే..’ పాట సినిమాకి పెద్ద హైలెట్ అయింది. 
 
ఈ పాటలో ఇంద్రజతో కలిసి సూపర్‌స్టార్ కృష్ణ వేసిన స్టెప్స్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఒక చిన్న హీరోతో ఎస్.వి.కృష్ణారెడ్డి రూపొందించిన ‘యమలీల’ కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ప్రదర్శింపబడింది. విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ‘యమలీల’ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్-2 తీస్తానని వర్మ ప్రకటన..