ఇటీవలే సినిమారంగంలో జర్నలిజం పేరుతో రకరకాల వ్యక్తులు సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా, ఇన్‌స్టాలు, ట్విట్టర్ మెయింటేన్ చేసేవారు ఎక్కువయిపోయారు. వారు సినిమా ప్రమోషన్ విషయంలో శ్రుతిమించినట్లు ప్రవర్తిస్తుంటారు. కొంతమంది నిర్మాతలకు ఇదే పబ్లిసిటీ మారి సోషల్ మీడియాలో వచ్చిన ఆదరణ చూసి ఆనందపడిపోతుంటారు. సినిమా రిలీజ్ వరకు మరికొంతమంది నెగెటివ్‌గా ప్రశ్నలు వేయమని చెబుతూ ఎంకరేజ్ చేస్తారు. ఇటీవల వర్జిన్ బాయ్స్ సినిమాకు అదే జరిగింది. కానీ సినిమాను ప్రజలు ఎంతమేరకు ఆదరించారో తెలిసిందే.
చిన్న నిర్మాతలే కాకుండా పెద్ద నిర్మాతలకు రెగ్యులర్‌గా సినిమా చేసే వారికీ ప్రమోషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమధ్య దిల్ రాజు కూడా తమ్ముడు సినిమా రిలీజ్‌కు ముందు సినిమాలోని పాట వైరల్ అవుతుందని చెప్పారు. ఆయన టీమ్ ఆ పాటను 2 మిలియన్ల వరకు చేరిందని చెప్పారట. దానికి ఆయన ఇదంతా నిజమేనా? అంటూ వారికి సెటైర్ వేశారు. మరి అంతమంది వింటే సినిమాను ప్రజలు ఎందుకు చూడడంలేదో ఆయనకే అర్థంకాలేదట.
ఇక అసలు విషయానికి వస్తే, ఓ పేరున్న పెద్ద నిర్మాత తన సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలుస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రమోషన్లలో ఆయన పాల్గొంటున్నారు. అయితే తన సినిమా గురించి మాట్లాడుతూ, అప్పటి జర్నలిస్టుల గురించి తమిళనాడులో జరిగిన తన పుట్టినరోజు గురించి గుర్తుచేసుకుంటూ జర్నలిస్టులంటే నాకెంతో అభిమానం. కలం చాలా గొప్పది అనేవిధంగా మాట్లాడారు. షడెన్‌గా ఆరుదశాబ్దాలకు పైబడిన ఓ జర్నలిస్టు, సినిమాకు హైప్ లేదు. బిజినెస్ లేదు. అసలు ఆడుతుందో లేదో అనేవిధంగా తనశైలిలో ప్రశ్నలు సంధించాడు. దానికి కొంచెం మనస్తాపం చెందిన నిర్మాత, సినిమా ప్రమోషన్లో ఇలాంటివి ఏమిటని సున్నితంగా మాట్లాడారు. అయినా ఆయన వినకుండానే మరింతముందుకు వెళ్లి ఈ సినిమాతో మీరు అయిపోయారనే టాక్ వస్తుందనేలా ఇన్‌డైరెక్ట్‌గా అడగడంతో మిగిలిన జర్నలిస్టులంతా షాక్‌కు గురయ్యారు.
నిర్మాత కలత చెందారు. అంతా అయిపోయాక ఆయన వెళ్ళిపోతూ.. మీడియా సమావేశం ఇలా వుంటుందనుకోలేదు. కేన్సిల్ చేయమని చెప్పాను. కానీ అప్పటికే ఫిక్స్ అవడంతో రావడం జరిగింది. కానీ ఇలాంటి ప్రశ్నలతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. కోట్లు పెట్టి ఆర్టిస్టులతో ఎడ్జస్ట్‌కు చాలా కష్టపడి సినిమా తీసి విడుదల చేస్తుంటే.. ఇలా నిర్మాతను తప్పుచేసినవాడిగా నిందిస్తారా? అంటూ భావోద్వేగానికి లోనవడంతో కళ్ళు చెమర్చాయి. అది బాధాకరంగా అక్కడివారికి అనిపించింది. ఈ విషయాన్ని ఫిలింఛాంబర్ సబ్‌కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని కొందరు సూచిస్తున్నారు.