టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. ఆయన వయసు 53. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయనను కొన్ని రోజుల క్రితం నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించారు. వైద్య సేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న వెంకట్.. నటుడు శ్రీహరి ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ వీవీ వినాయక్ ఆయనను నటుడుగా పరిచయం చేశారు. వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫైటర్‌గా సినీ అభిమానులను ఆలరించారు. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.