నేను గతంలో ఎస్వీసీ సంస్థలో "జాను" అనే మూవీలో నటించాను. "తమ్ముడు" కోసం పిలవగానే వచ్చి ఆడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో వెంటనే ఓకే అయ్యాను. దర్శకుడు వేణు ఈ మూవీ గురించి చెబుతూ అడవిలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నారు. నేను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తాను అని చెప్పాను. అలా చిత్ర క్యారెక్టర్ కు నేను సెలెక్ట్ అయ్యాను అని వర్ష బొల్లమ్మ తెలిపారు.
నితిన్ కథానాయకుడిగా నటించగా దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. రామ్ వేణు దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. "తమ్ముడు" సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర క్యారెక్టర్ లో నటించిన వర్ష బొల్లమ్మ పలు విషయాలు తెలిపారు.
- హీరో నితిన్ క్యారెక్టర్ జై కు చిత్ర డ్రైవింగ్ ఫోర్స్ లా ఉంటుంది. జై కు అన్ కండిషనల్ గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. వారి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. రియల్ లైఫ్ లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేశాను. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే క్యారెక్టర్ చిత్రది. నా రియల్ లైఫ్ లో నేను అలా కాదు.
- ఈ చిత్రంలో లయ గారు మరో కీ రోల్ చేశారు. ఆమె జర్నీ మా అందరికీ ఇన్సిపిరేషన్. హీరోయిన్ గా ఒక కెరీర్ చూసిన ఆమె పర్సనల్ లైఫ్ లోకి వెళ్లడం, మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆమె కెరీర్ లో జరిగిన విశేషాలు మాతో షేర్ చేసుకునే వారు.
- "తమ్ముడు" మూవీని ఏదైనా స్టూడియోలో ఉన్న చిన్న అడవిలో కూడా షూట్ చేయొచ్చు కానీ సహజంగా ఉండేలా మారేడుమిల్లి అడవిలో చిత్రీకరించాం. అది దట్టమైన అడవి. వర్షాకాలంలో పాములు, తేళ్లు కనిపించేవి. రాత్రిపూట షూటింగ్ లో కేవలం కాగడాలు పట్టుకుని నటించాం. షూటింగ్ లో పెద్దవాళ్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా ఇబ్బందిపడ్డారు. లయగారు అమెరికా నుంచి వచ్చారు. అక్కడ సుకుమారంగా ఉండి ఈ అడవిలో చెప్పులు లేకుండా నటించారు. రోజూ ఏదో ఒక గాయం అయ్యేది. అయినా ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొనేవారు. నాకు నితిన్ క్యారెక్టర్స్ కు షూస్ ఉంటాయి.
- ఈ చిత్ర పాత్ర రీత్యా నిత్యామీనన్ ను ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. తనకు పర్ ఫార్మర్ గా పేరుంది. నేనూ అలాగే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ డైరెక్టర్ గారు డైలాగ్ లో ఉన్నది ఉన్నట్లు స్ట్రిక్ట్ గా చెప్పమనేవారు. నేను మిడిల్ క్లాస్ మెలొడీస్ చేసినప్పుడు స్పాంటేనియస్ గా చాలా ఇంప్రూవ్ చేసి డైలాగ్స్ చెప్పాం. ఆ మూవీకి అలా కుదిరింది.
- ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. దీంతో పాటు మరో సిరీస్ చేస్తున్నా. రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా. సైకో కిల్లర్ క్యారెక్టర్ లో కనిపించాలనేది నా కోరిక. నేను సైకో కిల్లర్ ఏంటి అనుకుంటారు. కానీ మనం ఆ జానర్ మూవీస్ చూస్తే ఎవరూ ఊహించని పాత్రలే క్రైమ్స్ చేస్తుంటాయి. అలాంటి అవకాశం వస్తే నటిస్తా.