హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణం కూడా ఆమెనే.. దసరా పండగ సందర్భంగా తన అభిమానులకు 'కొత్త ప్రయాణం' అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. దీనిపై నెట్టింట విస్తృత చర్చ మొదలైంది. కొంతకాలంగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్యాచిలర్‌లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. పైగా, ఇటీవలే ఆమె ఓ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంటి ముందు గోడపై తన పేరులోని మొదటి అక్షరాలతో 'SAM' అని డిజైన్ చేయించిన లోగో ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఈ ఇల్లు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారా? లేక ముంబైలోనా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ నేపథ్యంలో సమంత 'కొత్త ప్రయాణం' అని పేర్కొనడంతో ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొత్త అధ్యాయమేనని పలువురు భావిస్తున్నారు. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పలు కార్యక్రమాలకు వీరిద్దరూ జంటగా హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' వంటి వెబ్ సిరీస్‌లకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ పరిచయమే ప్రేమగా మారిందని, త్వరలోనే వీరు ఒక్కటి కాబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సమంత కొత్త ఇంటి ఫొటో షేర్ చేయడంతో ఆ ప్రయాణం రాజ్ తోనేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.