యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం ఇటీవలే ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. బాహుబలి తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రారంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర కథ గురించి కొన్ని కథలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి కానీ.. రాజమౌళి మాత్రం కథ విషయంలో ఎలాంటి క్లూ ఇవ్వలేదు.
కాగా ఈ సినిమా బిజినెస్ ఎంత జరగనుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే... ఈ సినిమా హక్కులు అన్ని భాషలు కలుపుకొని 350 కోట్ల వరకు డిమాండ్ ఉంటుందని అంచనా. ఇక శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు మరో 150 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు (నవంబర్ 19) నుంచే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్‌లో చరణ్, ఎన్టీఆర్‌ల పైన యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో ఉంటుందని సమాచారం.