మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం చేసే అవకాశం వస్తే యువ దర్శకులు ఎగిరిగంతేస్తారు. అలాంటిది తెలుగువాడైన ఓ తమిళ దర్శకుడు ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఛాన్స్ టాలీవుడ్ దర్శకుడు వివి.వినాయక్‌కు చేరినట్టు సమాచారం.
అసలేం జరిగిందో తెలుసుకుందాం.. ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ మరో పది పదిహేను రోజుల ఉందనగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. వచ్చేనెలలో ఆ కాస్త షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఆ తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌లో చేయనున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇది రొటీన్‌కి భిన్నమైన సినిమాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అందువలన ఆ సినిమా రీమేక్‌లో చేయాలని చిరూ భావించారు.
ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తమిళ దర్శకుడు, తెలుగు నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజాకి అప్పగించారు. కొంతకాలంగా తెలుగు నేటివిటీకి తగిన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అయితే వాటి విషయంలో చిరంజీవి అసంతృప్తిగానే ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి మోహన్ రాజా తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణమేమిటనేది మాత్రం తెలియదు. మోహన్ రాజా తప్పుకోవడం నిజమే అయితే, ఈ ప్రాజెక్టు వినాయక్ చేతికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.