Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఆర్టీసీలో ఎందుకలా?

తెలంగాణ ఆర్టీసీలో ఎందుకలా?
, గురువారం, 12 డిశెంబరు 2019 (07:48 IST)
తెలంగాణ ఆర్టీసీలో ఏదో జరుగుతోంది. ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ జరుగుతున్న పరిణామాలు మాత్రం సందేహాలు రేకెత్తిస్తున్నాయి. నష్టదాయకంగా నడిచే రూట్లలో బస్సులను వదిలించుకోవాలని అధికారులు ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నారు. ఇంతలో సీఎం కేసీఆర్‌ చేసిన సూచన వారికి చక్కటి అవకాశంగా మారింది.

నష్టాలు తెచ్చి పెడుతున్న 500 బస్సులను పక్కన పెట్టండని సీఎం చెబితే.. అధికారులు ఏకంగా 1,000 బస్సులను పక్కన పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏయే రూట్లలో బస్సులను తగ్గించాలనే సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారు. నేడో రేపో దాన్ని అమలు చేయబోతున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీ 3726 రూట్లలో 10,460 బస్సులతో ప్రజలకు సేవలందిస్తోంది. ఇందులో ఆర్టీసీ బస్సులు 8357 కాగా, 2103 అద్దె బస్సులు. ఏసీ, నాన్‌ ఏసీ బస్సులు జిల్లాల్లో 6622 వరకు తిరుగుతుండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 3838 బస్సులు తిరుగుతున్నాయి.
 
సీఎం కేసీఆర్‌ నష్టాలొచ్చే 500 బస్సులను పక్కనపెట్టమని చెప్పగా.. అధికారులు మాత్రం 1000 బస్సులను రద్దు చేసి, డిపోలకు పరిమితం చేయబోతున్నారు. అవసరమైతే వాటిని సరకు రవాణాకు వినియోగించాలని యోచిస్తున్నారు. గ్రేటర్‌ జోన్‌లో నడిచే బస్సులనే ఎక్కువగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఒక్కో డిపో నుంచి 30 బస్సుల చొప్పున 29 డిపోల నుంచి 870 బస్సులు రద్దు కానున్నాయి.

జిల్లాల్లో మరో 150 బస్సుల వరకు రద్దు చేయాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ప్రతిపాదనలను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మకు పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆయా డిపోల వారీగా రద్దు చేసిన బస్సులను పక్కన పెడతారు.
 
ఆర్టీసీకి అద్దె బస్సులతోనూ నష్టాలు వస్తున్నాయి. కానీ, రద్దు చేసే బస్సుల జాబితాలో మాత్రం వాటిని చేర్చడం లేదు. సిటీలో నడిచే 40 ఎలక్ట్రిక్‌ బస్సులు సహా మిగతా అద్దె బస్సులన్నీ నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. 2014-15 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.630.40 కోట్ల నష్టాలను అంటగట్టాయి.

2103 అద్దె బస్సుల వల్ల రోజుకు రూ.40.87 లక్షల నష్టం వస్తోంది. ఆర్టీసీ సొంత బస్సు రోజుకు సగటున రూ.13,121 సంపాదిస్తుంటే, అద్దె బస్సు రూ.10,544 మాత్రమే సంపాదిస్తోంది. అంటే అద్దె బస్సు వల్ల రోజుకు రూ.2577 నష్టం వస్తోంది. కానీ, ఇలాంటి బస్సుల సంఖ్యను పెంచుతున్నారు తప్ప తగ్గించడం లేదు.

ఇప్పటికే ఉన్న అద్దె బస్సులకు అదనంగా మరో 1334 బస్సులను తీసుకోబోతున్నారు. సొంత బస్సులను పక్కన పెడుతున్న అధికాలు.. అద్దె బస్సుల జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో కోటి మొక్కలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్